
తెలంగాణలోని అసంఘటిత కార్మికుల కోసం దేశానికి రోల్ మాడల్‌గా ఉండే ఒక మంచి విధానం తీసుకొస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న తరుణంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ కార్మిక దినోత్సవం (May Day) సందర్భంగా తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సోదరులందరికీ ముఖ్యమంత్రి గారు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ..
“మే డే రోజున కార్మిక సోదరులకు మాటిస్తున్నా. ఏ వెసులుబాటు ఉన్నా ప్రతి రూపాయి కార్మికుల సంక్షేమం, అభివృద్ధి, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే బాధ్యత తీసుకుంటా. ఒకనాడు నష్టాల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు జరుగుతున్న ఆర్టీసీలో ఈరోజు లాభాల బాటలో నడిచి జీతాలు చెల్లించుకునే స్థాయికి చేరుకోవడంలో కార్మికుల కృషి ఎంతో ఉంది. ఆర్టీసీని గాడిలో పెట్టి లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం.
సమ్మెకు వెళ్లాలని చర్చలు చేస్తున్నారు. ఈ సంస్థ మీదే. ఏమాత్రం పట్టింపులకు వెళ్లొద్దు. రాజకీయంగా ఎవరైనా ప్రోత్సహిస్తే, ఏదైనా తప్పుగా నిర్ణయం తీసుకుంటే మొత్తం వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి ఉందన్న విషయాన్ని ఆలోచన చేయండి.
మంత్రి గారితో చర్చించండి. చేయగలిగిందేమున్నా చేస్తాం. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరుతో ఏదైనా పొరపాటు జరిగితే, మళ్లీ పునరుద్ధరించడానికి అవకాశం కూడా లేని పరిస్థితులు తలెత్తుతాయి.
మీ అందరి సహకారంతో అన్నింటా తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. కార్మిక చట్టాలను సవరించి కార్మికులను ఆదుకునే విధానాన్ని తెచ్చి దేశానికి మార్గదర్శిగా తెలంగాణ నిలబెడుతాం.
తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ శాఖ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిది. వారిని ఆదుకోవాలనే ఆలోచనతో సవరించుకుంటూ, సరిచేసుకుంటూ పాలన పరమైన ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం.
సింగరేణి సంస్థ లాభాల బాటలో నడవడమే కాకుండా గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో కార్మికులకు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు బోనస్ చెల్లించాం. బీమా సౌకర్యం అమలు చేస్తున్నాం. సింగరేణి సంస్థలను లాభాల బాటలో నడిపించడమే కాకుండా బొగ్గు ఉత్పత్తి పెంచి, కొత్త గనులను కేటాయించి నూతనంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నిస్తున్నాం. సింగరేణిలో దాదాపు 400 పైచిలుకు కారుణ్య నియామకాలు చేపట్టాం. ఆర్టీసీలోనూ కారుణ్య నియామకాలు చేపట్టాం.
రైతు భరోసా, రైతు రుణమాఫీ, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం, నిరుపేదలకు సన్నబియ్యం ఇలా రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం ఆగలేదు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. ఇన్ని చేసినా సరిపోతాయని భావించడం లేదు. ఇంకా సమస్యలున్నాయి. కార్మికులకు కష్టాలున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించాలంటే కొంత సమయం కావాలి.
తెలంగాణలో పూర్తి చేసిన కులగణన ఈరోజు దేశానికి ఆదర్శవంతంగా నిలబడింది. తెలంగాణ మాడలే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసి వచ్చింది. కులగణన చేస్తామన్నాం. చేశాం. ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నాం. చేశాం. ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఇచ్చాం. సన్న బియ్యం ఇచ్చాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం… ఇలా చేయగలిగింది ప్రతిదీ చేస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే మీకే చెప్పుకుంటాం. సహకరించండి” అని ముఖ్యమంత్రి గారు వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు గారు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

