
దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సందర్భంగా కుల గణనను కూడా చేర్చాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ అనుభవాలను కేంద్ర ప్రభుత్వానికి అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. జనాభా లెక్కల్లో కుల గణన అంశం చేర్చాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఇందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర మంత్రివర్గానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు.
జనాభా లెక్కల్లో కుల గణన చేర్చాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో నిర్వహించిన కుల గణన దేశానికి రోల్ మోడల్‌గా ఉందని, ఈ విషయంలో తమ అనుభవాలను పంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని స్పష్టం చేశారు. ఓబీసీల్లో రాష్ట్రాల వారిగా వేర్వేరు కేటగిరీలుగా ఉన్నందున, కుల గణన విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టబోయే ముందు రాజకీయ పార్టీలతో చర్చించడానికి మంత్రులతో ఒక కమిటీని నియమించాలని, అలాగే ఉన్నతస్థాయిలో అధికారులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి క్షుణ్ణంగా అధ్యయనం జరగాల్సి ఉంటుందని తెలిపారు. తమ అనుభవాలను పంచుకోవడానికి కేంద్రం మమ్మల్ని పిలిచినా, లేదా కేంద్ర ప్రతినిధులు వచ్చినా, తెలంగాణ నిర్వహించిన కుల గణనలో అనుసరించిన విధివిధానాలను వివరిస్తామని చెప్పారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రస్తుత లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు, రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో కుల గణన పూర్తి చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
జనాభా లెక్కలు ఎప్పుడు ప్రారంభమై, ఎప్పటికి పూర్తవుతాయో కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు. కుల గణన చేపట్టడంలో ఎదురయ్యే సవాళ్లను ఏ విధంగా అధిగమిస్తారో అన్ని రాజకీయ పార్టీలను సమావేశ పరిచి వివరించి, వారి సలహాలను తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.
రాష్ట్రాలతో పాటు రాజకీయ పార్టీలు, సివిల్ సొసైటీలు, ప్రజల నుంచి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రక్రియలు పూర్తైన తర్వాత కుల గణనపై విధివిధానాలను ఖరారు చేయాలని సూచించారు. ఈ గణన పూర్తి చేయడానికి ఏడాది కాలం సరిపోతుందని తెలిపారు.
కుల గణన చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, అందుకే శాసనసభ ద్వారా ఒక తీర్మానం ఆమోదించి కేంద్రానికి నివేదించామని తెలిపారు. కుల గణన విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సహకరించడానికి తమ ప్రభుత్వం ఒక బాధ్యతగానే చూస్తుందని చెప్పారు.
ఇందులో ఎలాంటి రాజకీయాల జోలికి, పంతాలకు పట్టింపులకు వెళ్లదలచుకోలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో కుల గణన ఏ విధంగా చేపట్టిందో ముఖ్యమంత్రి గారు వివరిస్తూ, దేశవ్యాప్తంగా చేపట్టాలనుకుంటున్న కుల గణనకు తెలంగాణలో చేపట్టిన గణన ఒక మార్గదర్శిగా నిలుస్తుందని, తమ అనుభవాలను పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.

