Hon’ble CM Sri Revanth Reddy Invites Global Collaboration at Bharat Summit to Propel Telangana’s Growth and Welfare Mission

Bharath Summit Hicc
Bharath Summit Hicc 1

సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, పర్యావరణ సమతుల్యతను సాధిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రజా ప్రభుత్వం చేపట్టిన మిషన్‌లో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత్ సమ్మిట్ వేదికగా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలపడానికి పారదర్శకమైన సంస్కరణలతో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందని చెప్పారు. అందుకోసం “తెలంగాణ రైజింగ్” బ్రాండ్ అంబాసిడర్లుగా రాష్ట్ర గొప్పతనాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటాలని సదస్సును ఉద్దేశించి కోరారు.

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో పాటు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన భారత్ సమ్మిట్ (Bharat Summit)లో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని, సంక్షేమ పథకాలను, మరియు సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను వివరించారు.

“విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళల నాయకత్వంలో దశాబ్దాల పాటు జరిగిన పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మొదటి దశాబ్దంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోవడంతో ఏర్పడిన నిరాశను తొలగించడానికి ప్రజా ప్రభుత్వం ఆ వర్గాల ఆశలను నెరవేర్చే స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తోంది.

ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. 20 వేల కోట్ల రూపాయలతో 25 లక్షలకుపైగా రైతులకు రుణమాఫీ చేసి దేశ చరిత్రలోనే అతిపెద్ద రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేశాం. సేద్యానికి 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 12 వేలు పంట పెట్టుబడి సహాయం, భూమి లేని వ్యవసాయ కార్మికుల కుటుంబానికి కూడా రూ. 12 వేల మద్దతుని ప్రభుత్వం అందిస్తోంది.

ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు ప్రతి క్వింటాలుపై రూ. 500 అదనపు బోనస్ అందిస్తూ రైతాంగానికి అండగా నిలుస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం.

యువతకు నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని స్థాపించాం. గతంలో ఉద్యోగ నియామకాలు లేని పరిస్థితిని సవరిస్తూ, ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాం. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా 5 లక్షల మంది యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించబోతున్నాం.

దావోస్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్‌లలో పెట్టుబడి సమ్మిట్ల ద్వారా రాష్ట్రానికి రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. వీటి ద్వారా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నాం. తెలంగాణ వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, అత్యధిక స్వంత పన్ను వసూళ్లు, జీసీసీలు, డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో అభివృద్ధితో పాటు దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపాలని యత్నిస్తున్నాం.

తెలంగాణ సంస్కృతిలో మహిళలకు సమాన గౌరవం ఉండాలన్న లక్ష్యంతో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాం. 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తున్నాం.

ప్రభుత్వం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది సభ్యులను కోటికి పెంచడమే కాకుండా వారిని కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. అందులో భాగంగా మహిళలకు సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, మరియు ప్రీమియం రిటైల్ ఔట్‌లెట్లలో షాపులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, బస్సులను కేటాయించడం వంటి అనేక చర్యలు చేపట్టాం.

విద్య, ఆరోగ్యం ప్రాధాన్యతా రంగాలుగా ఎంచుకున్న ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్సకయ్యే ఖర్చును రూ. 10 లక్షలకు పెంచడం, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పటికే వెయ్యి కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాం.

కాలుష్యం నుంచి హైదరాబాద్ నగరానికి విముక్తి కల్పించడానికి ప్రభుత్వం మూసీ పునరుజ్జీవ కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది.

ఓబీసీ జనగణన చేసి దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పూర్తి చేయడంలో కూడా దేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణయే.

ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించడానికి పారదర్శకమైన పద్ధతిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం సరికొత్త సంక్షేమ విధానాన్ని రూపొందిస్తున్నాం” అని ముఖ్యమంత్రి గారు వివరించారు.

అనంతరం రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్ చర్చలపై 44 అంశాలతో కూడిన “హైదరాబాద్ తీర్మానం” విడుదల చేశారు.

Bharath Summit Hicc 2
Bharath Summit Hicc 3
Bharath Summit Hicc 4