Hon’ble CM Sri Revanth Reddy Leads Telangana to Secure MoUs with Japanese Firms for 500 International Job Opportunities

Tomkom Japam Cm 1
Tomkom Japam Cm 2

తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను అందించేందుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని “తెలంగాణ రైజింగ్” బృందం జపాన్‌కు చెందిన రెండు ప్రముఖ సంస్థలతో విజయవంతమైన చర్చలు జరిపింది.

తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (Telangana Overseas Manpower Company Ltd)-(TOMCOM) , జపాన్‌కు చెందిన టెర్న్ గ్రూప్ (TERN Group – TGUK Technologies Private Limited), రాజ్ గ్రూప్‌ (Raj Group) లతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి గారి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందాల ద్వారా, రాబోయే 1–2 సంవత్సరాల్లో జపాన్‌లోని వివిధ రంగాల్లో 500 ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఆరోగ్య సంరక్షణ రంగంలో 200, ఇంజనీరింగ్ (ఆటోమోటివ్, మెకానికల్, ఐటీ) రంగంలో 100, ఆతిథ్య రంగంలో 100, నిర్మాణ రంగం (సివిల్, భవన నిర్మాణం, పరికరాల నిర్వహణ)లో 100 ఉద్యోగాలు ఉన్నాయి.

టోక్యో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే TERN గ్రూప్, జపాన్‌లో సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్ మరియు Specified Skilled Worker (SSW) నియామకాల్లో ప్రసిద్ధి చెందిన సంస్థ. అలాగే, రాజ్ గ్రూప్, జపాన్‌లోని ప్రముఖ నర్సింగ్ కేర్ సంస్థ సుకూయి కార్పొరేషన్‌తో కలిసి, సంరక్షకుల (కేర్ టేకర్స్) శిక్షణ మరియు నియామకాలలో TOMCOMతో ఇప్పటికే సహకరిస్తోంది. తాజా ఒప్పందంతో ఈ భాగస్వామ్యం ఆరోగ్యేతర రంగాలకు కూడా విస్తరించనుంది.

ఈ ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణతో పాటు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను అందించే లక్ష్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.

Tomkom Japam Cm 3