
జపాన్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రాష్ట్రానికి మరో రూ.10,500 కోట్ల భారీ పెట్టుబడిని సాధించింది.
డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఐటీ సేవల్లో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఎన్‌టీటీ డేటా (NTT DATA Group Corporation), అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్లౌడ్ ప్లాట్‌ఫాం సంస్థ నెయిసా నెట్‌వర్క్స్ (Neysa Networks Pvt Ltd)లు సంయుక్తంగా హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ (AI Data Center Cluster in Hyderabad) ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రూ.10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్‌ను నిర్మించేందుకు త్రైపాక్షిక ఒప్పందం (MoU) కుదిరింది.
టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎన్‌టీటీ డేటా, నెయిసా నెట్‌వర్క్స్‌ల నుంచి బోర్డు సభ్యుడు కెన్ కట్సుయామా గారు, డైరెక్టర్ తడావోకి నిషిమురా గారు, ఎన్‌టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బాజ్‌పాయ్ గారు, నెయిసా సీఈవో, ఎన్‌టీటీ గ్లోబల్ డేటా ఛైర్మన్ శరద్ సంఘీ గారు ఈ ఒప్పందంలో పాల్గొన్నారు.
ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్‌లో 400 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ నిర్మితమవుతుంది. 25,000 జీపీయూలతో భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్‌కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను ఈ క్లస్టర్ అందిస్తుంది.
తెలంగాణను దేశంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. ఎన్‌టీటీ డేటా, నెయిసా కంపెనీలు సంయుక్తంగా ఏఐ-ఆధారిత సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసేందుకు ఈ క్లస్టర్ ఆవిష్కరణల కేంద్రంగా నిలుస్తుంది.
ఈ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను 500 మెగావాట్ల వరకు గ్రిడ్ విద్యుత్‌తో, మిగిలినది పునరుత్పాదక శక్తి ద్వారా నిర్వహిస్తారు. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను అవలంభిస్తారు.
ఈ ప్రాజెక్టును ఉన్నత ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్) ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. తెలంగాణలోని విద్యా సంస్థలతో భాగస్వామ్యంతో ఈ క్యాంపస్ ఏఐ ప్రతిభను పెంపొందిస్తుంది మరియు రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు దోహదపడుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పెట్టుబడి ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో విధానంలో అనుమతులతో పాటు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రతిభావంతులైన నిపుణులు ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపాయన్నారు.
ఎడబ్ల్యూఎస్, ఎస్‌టీటీ, టిల్‌మన్ హోల్డింగ్స్, సీటీఆర్‌ఎల్‌ఎస్ వంటి దిగ్గజ కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టులతో పాటు, ఎన్‌టీటీ డేటా భారీ పెట్టుబడి ఒప్పందంతో హైదరాబాద్ దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్‌గా మరింత బలపడిందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎన్‌టీటీ డేటా, ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ప్రముఖ సంస్థ. 50కి పైగా దేశాల్లో 193,000 మంది ఉద్యోగులతో, ప్రపంచంలోని టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఒకటిగా నిలుస్తుంది.
పబ్లిక్ సర్వీసెస్, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, టెలికాం రంగాలకు సేవలు అందిస్తుంది. నెయిసా నెట్‌వర్క్, ఏఐ-ఆధారిత క్లౌడ్ ప్లాట్‌ఫాం సంస్థగా, నిర్దిష్ట ఏఐ కంప్యూట్ సొల్యూషన్స్‌పై దృష్టి సారిస్తుంది.

