‘వనజీవి’గా ప్రసిద్ధి చెందిన సామాజికవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ప్రకృతి, పర్యావరణం లేనిదే మానవ మనుగడ అసాధ్యమని విశ్వసించి, ఈ సిద్ధాంతానికి తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రామయ్య గారని సీఎం గారు కొనియాడారు.
సామాన్య వ్యక్తిగా మొక్కలు నాటడం ద్వారా సమాజాన్ని స్ఫూర్తివంతం చేసిన రామయ్య గారి మరణం సమాజానికి తీరని లోటని, వారు చూపిన మార్గం అందరికీ ఆదర్శమని సీఎం గారు పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన వనజీవి రామయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మొక్కలు నాటే ఉద్యమంలో రామయ్య గారి వెన్నంటి నడిచిన వారి సతీమణి జానమ్మ గారికి, కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.