
రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబియ్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో ఒక లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు స్వయంగా సహపంక్తి భోజనం చేశారు.
భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు లబ్ధిదారుడి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను వివరాలు అడిగారు.
దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు వాటిని తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదని చెప్పిన తులసమ్మ, ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు.
200 యూనిట్స్ వరకు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అందుతున్నాయా అని సంక్షేమ పథకాల గురించి ముఖ్యమంత్రి గారు వారి నుంచి ఆరా తీశారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తమకు ఎంతో ఉపయోగపడుతుందని తులసమ్మ ఆనందం వ్యక్తం చేశారు.

