CM Sri Revanth Reddy Directs Telangana Education Commission to Formulate Comprehensive Policy for Education Reform

Review Meeting Cm 04 04 25
Review Meeting Cm 04 04 25 1

తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్య‌వ‌స్థ రూప‌క‌ల్ప‌న‌కు స‌మ‌గ్ర విధాన ప‌త్రం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు విద్యా క‌మిష‌న్‌ను ఆదేశించారు. ఉత్త‌మ విద్యా వ్య‌వ‌స్థ ఏర్పాటుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వం వెనుకాడ‌బోదని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టేలా, ఆచరణ యోగ్యంగా విధాన‌ ప‌త్రం ఉండాల‌ని చెప్పారు.

ప్ర‌స్తుత విద్యా వ్య‌వ‌స్థ‌లో లోపాలు, తీసుకురావ‌ల్సిన సంస్క‌ర‌ణ‌ల‌పై ముఖ్య‌మంత్రి గారు ఐసీసీసీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. విద్యా రంగానికి త‌మ ప్ర‌భుత్వం ఇస్తున్న ప్రాధాన్య‌త‌, ఉపాధ్యాయుల నియామ‌కం, అమ్మ ఆద‌ర్శ క‌మిటీలు, పుస్త‌కాలు, యూనిఫాంల పంపిణీతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ (YISU) నిర్మాణాన్ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

ప్రాథ‌మిక ద‌శలో అందే విద్య‌తోనే పునాది బ‌ల‌ప‌డుతుంద‌ని.. ప్రాథ‌మిక విద్య‌ను బ‌లోపేతం చేస్తే ఉన్న‌త చ‌దువుల్లో విద్యార్థులు మ‌రింత మెరుగ్గా రాణించ‌గ‌ల‌ర‌ని ముఖ్యమంత్రి గారు అభిప్రాయ‌ప‌డ్డారు. అంగ‌న్‌వాడీలు, ప్రాథ‌మిక పాఠశాల స్థాయిలో తీసుకురావల్సిన మార్పుల‌పై స‌మాజంలోని వివిధ సంఘాలు, ప్ర‌ముఖుల‌తో చ‌ర్చించి మెరుగైన విధాన ప‌త్రం రూపొందించాల‌ని సూచించారు. విద్యా వ్య‌వ‌స్థ‌లో తెలంగాణ అగ్ర‌గామిగా ఉండేందుకు దోహ‌ద‌ప‌డేలా సూచ‌న‌లు, స‌ల‌హాలు ఉండాల‌ని చెప్పారు.

వివిధ రాష్ట్రాల్లో జరిపిన ప‌ర్య‌ట‌న‌లు, ఆయా రాష్ట్రాలు, ఇత‌ర దేశాల్లో ప్రాథ‌మిక విద్య‌లో అనుస‌రిస్తున్న విధానాల‌ను విద్యా క‌మిష‌న్ చైర్మ‌న్ ఆకునూరి మురళి గారు ఈ సందర్భంగా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు.

1960 ద‌శ‌కం నుంచి ఇప్పటివరకు విద్యా వ్య‌వ‌స్థ‌లో తీసుకువ‌చ్చిన ప‌లు సంస్క‌ర‌ణ‌లు క్ర‌మేణా విద్యార్థుల సృజ‌నాత్మ‌క శ‌క్తి, ఆలోచ‌నా ధోర‌ణిని ఎలా హ‌రించి వేశాయో ఫౌండేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ (లోక్‌సత్తా జేపీ) గారు వివరించారు. విద్యా వ్యవస్థలో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు గారు, తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు గారు, డా. చారుకొండ వెంకటేష్ గారు, కె. జ్యోత్స శివా రెడ్డి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Review Meeting Cm 04 04 25 2
Review Meeting Cm 04 04 25 3