CM Sri. A. Revanth Reddy participated in Distribution of appointment letters to newly recruited candidates for the post of Junior Lecturer in Intermediate and Polytechnic Colleges

Appointment Letters Pic 1

“అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలచుకోలేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలకు వివరించి, ప్రజల అనుమతి తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాను” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామని పిలుపునిచ్చారు.

Appointment Letters Pic 2 1

ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లు, ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఎంపికైన 1532 మంది అభ్యర్థులకు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన “ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగ పత్రాలు అందుకున్న అభ్యర్థులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “విద్యార్థుల భవిష్యత్తుతో పాటు, తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ కంకణబద్ధులై పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర చాలా క్రియాశీలకమైంది. గత ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధి కనబరచలేదు. నియామకాలకు సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు ఏళ్ల తరబడి వాయిదా పడుతుంటే ఒక్కొక్కటిగా చిక్కుముడులను విప్పుకుంటూ నియామకాలను పూర్తి చేశాం.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 57,946 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. తెలంగాణ ఉద్యమానికి పునాదిగా నిలిచిన నిరుద్యోగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్న సంతృప్తి మాకుంది. ఒక్క ఏడాది కాలంలో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం దేశంలోనే మరొకటి లేదు. ఇది నాకు ఆత్మ సంతృప్తినిచ్చిన సందర్భం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 55 రోజుల్లో డీఎస్సీ నిర్వహించి 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం.

మీకు వచ్చిన ఉద్యోగం కుటుంబ భవిష్యత్తే కాదు, భవిష్యత్తు తరాలను కూడా తీర్చిదిద్దడానికి ఉపయోగపడాలి. దేశ భవిష్యత్తు విద్యా శాఖతో ముడిపడి ఉంది. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉంది. విద్యా శాఖకు కేటాయించే నిధులు ఖర్చు కాదు. భవిష్యత్ తరాలకు పెట్టుబడి.

విద్యలో కేరళతో పోటీ పడి రాణించాల్సిన తెలంగాణ ఈరోజు కింది నుంచి రెండో మూడో స్థానంలోకి పడిపోయిందంటే తెలంగాణ జాతికి అవమానం. వాస్తవాలను అంచనా వేసుకుని, వాస్తవాల మీద చర్చించుకుని భవిష్యత్తుకు ప్రణాళికలను తయారు చేసుకున్నప్పుడే తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి దోహదపడుతుంది.

ప్రభుత్వ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో అత్యుత్తమ ప్రమాణాలు, అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నప్పటికీ అంతగా అనుభవం లేని ప్రైవేటు స్కూళ్లల్లో ఎక్కువ మంది పిల్లలు ఎందుకు చదువుతున్నారు. ప్రైవేటు స్కూళ్లతో ఎందుకు పోటీ పడలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచించాలి.

ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే పరిణామం. ఇంత ఖర్చు పెడుతున్నా ఫలితాలు సాధించలేకపోతే వృధా. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. చర్చించుకోవలసిన అవసరం ఉంది. లోపాలను సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది.

అందుకే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేడెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను నిర్మిస్తున్నాం. అందుకోసం 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాం. ప్రతి ఏటా లక్షలాది మంది ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవుతున్నా, స్కిల్స లేని కారణంగా వారిలో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. వీటన్నంటిని గమనించే తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టాం.

క్రీడలు దేశ ప్రతిష్టను పెంచుతాయి. దేశంలో ఇంత జనాభా ఉన్నప్పటికీ క్రీడల్లో రాణించలేకపోతున్నాం. కోట్లాది ప్రజలున్నా ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేకపోతున్నాం. విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

ఉద్యోగాల్లో చేరిన తర్వాత స్కూళ్లు, కాలేజీల్లో మట్టిలో మాణిక్యాలను వెలికితీసి క్రీడాకారులను తయారు చేయాలి. ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలి” అని ముఖ్యమంత్రి గారు వివరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు గారు, పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Appointment Letters Pic 3