Hon’ble Chief Minister Sri A Revanth Reddy participated in Special Programme to honour the unheard and unsung Heroes of the TG Police Dept at ICCC, Banjara Hills, Hyderabad

Zee Police Awards Cm
Zee Police Awards Cm 2

తెలంగాణలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నందునే ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏ దేశం, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటాయో ఆ ప్రాంతాలు అభివృద్ధి పథంవైపు నడుస్తాయని, తెలంగాణ ప్రశాంతంగా ఉండటానికి పోలీసు శాఖ కారణమని గర్వంగా చెబుతున్నానని అన్నారు.

సరిహద్దుల్లో దేశ భద్రతను సైనికులు ఏ విధంగా కాపాడుతున్నారో, రాష్ట్రంలో అంతర్గత శాంతి భద్రతలను హోంగార్డు నుంచి డీజీపీ వరకు దాదాపు 90 వేల మంది పోలీసు సిబ్బంది 4 కోట్ల తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నారని ముఖ్యమంత్రి గారు పోలీసు యంత్రాంగాన్ని ప్రశంసించారు.

రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వివిధ హోదాల్లో పనిచేస్తున్న 22 రియల్ హీరోస్ (పోలీసు) జీ తెలుగు సంస్థ (Zee Awards- 2025) అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

“పోలీసులు ఎంత నిబద్ధతతో పనిచేసినా విమర్శలు తప్పడం లేదు. పోలీసు శాఖలోని ఒకట్రెండు శాతం సిబ్బంది నిర్లక్ష్యం, అవగాహనా లోపం వల్ల సిబ్బందిపైన అనుమానాలు, అవమానాలు తప్పడం లేదు.

పోలీసు శాఖ రోజులో 18 గంటలు పనిచేస్తుంది. విధి నిర్వహణలో పోలీసులు పిల్లల చదువుల కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. పోలీసు పిల్లల భవిష్యత్తు కోసమే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించాం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

శాంతి భద్రతలు కాపాడటంలో తెలంగాణ నంబర్ 1 ర్యాంక్‌లో నిలిచింది. నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించడంలోనూ మొదటి స్థానంలో ఉన్నాం. సైబర్ క్రైమ్‌లో కొల్లగొడుతున్న సొమ్ముని రికవరీ చేయడంలోనూ దేశంలో మనం తొలిస్థానంలో ఉన్నాం. డ్రగ్స్ విషయంలో కూడా ఉక్కుపాదంతో అణిచివేయాలి. అందుకే డ్రగ్స్ నియంత్రించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాం.

నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం కంటే నేరం జరక్కుండా నియంత్రించాల్సిన బాధ్యత కూడా పోలీసులపైన ఉన్నది. ఆ దిశగా పోలీసు వ్యవస్థను అధునీకరించుకోవాలి. సాంకేతిక నైపుణ్యాన్ని సాధించుకోవాలి. హోంగార్డు నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ సేవలు అందించేలా ఉండాలి. అందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ప్రభుత్వం వెన్ను తడుతుంది. మంచి పనిని అభినందిస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చించుకుందాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర శాంతి భద్రతలను, పెట్టుబడులను అన్నింటినీ కాపాడుకోవలసిన అవసరం ఉంది. మనమంతా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులకు స్వీయ నియంత్రణ పరిష్కారం.

ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాష్ట్రానికి కావలసింది సమయస్ఫూర్తి. తెలంగాణను అభివృద్ధి పథంవైపు నడిపించుకుందాం. ప్రపంచానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలబెట్టుకుందాం” అని ముఖ్యమంత్రి గారు వివరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు గారు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త గారు, డీజీపీ జితేందర్ గారు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గారు, జీ న్యూస్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వివిధ సందర్భాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 22 మంది పోలీసులకు (రియల్ హీరోలు) ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జీ అవార్డులు- 2025 లను బహూకరించారు.

Zee Police Awards Cm 1
Zee Police Awards Cm 4