Telangana Police Ranked No.1 in India for Policing Performance: CM Sri Revanth Reddy Congratulates Force

Japan 1

అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు యావత్ పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025’ ప్రకారం, కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాలలో పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచింది. టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించిన ఈ నివేదికలో తెలంగాణకు గొప్ప గుర్తింపు దక్కడం రాష్ట్ర పోలీసుల కృషికి దక్కిన గౌరవమని, ఈ ఘనత రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి గారు అన్నారు.

శాంతిభద్రతలు కాపాడడం, నేరాలను నియంత్రించడం, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసుల నమోదులో పారదర్శకత చూపడం ద్వారా తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో శాంతి, న్యాయం నిలబెట్టడంలో విజయవంతమయ్యారని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

రాజీలేని కర్తవ్య నిర్వహణతో పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని, ప్రజా పాలనలో ఈ విజయం పోలీసు శాఖ సమిష్టి కృషి ఫలితమని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి విజయాలను తెలంగాణ పోలీసులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.