
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో మరొక మైలురాయిగా, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జపాన్‌లో జరిగిన వరల్డ్ ఎక్స్‌పో 2025 (World Expo 2025) వేదికగా రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఎక్స్‌పో 2025 (Expo 2025 Osaka)లో ముఖ్యమంత్రి గారి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భాగస్వామిగా పాల్గొంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వారితో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ వేదికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, వరల్డ్ ఎక్స్‌పో 2025లో భారతదేశం నుంచి మొట్టమొదటిగా పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఇది గర్వకారణమని తెలిపారు. తెలంగాణ – జపాన్ మధ్య ఉన్న చారిత్రక స్నేహ బంధాన్ని దీర్ఘకాలిక భాగస్వామ్యంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్తు ప్రణాళికలను రూపుదిద్దుకునే దిశగా కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
సులభతర పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణకు పెట్టుబడులకు ఆకర్షణగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. “హైదరాబాద్‌కు రండి, మీ ఉత్పత్తులు ఇక్కడ తయారు చేయండి. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచ దేశాలకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి” అంటూ జపాన్ కంపెనీలను ఆహ్వానించారు.
తెలంగాణ – జపాన్ మధ్య ఉన్న మంచి సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయానికి ఇది నాంది కావచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఒసాకా, అంతర్జాతీయంగా మిగతా భాగస్వాములతో కలసి అద్భుత భవిష్యత్తును నిర్మిద్దామని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో 30,000 ఎకరాల విస్తీర్ణంలో ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. ఇది ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇందులో భాగంగా జపాన్‌కు చెందిన మరుబెని కార్పొరేషన్‌తో కలిసి ఒక ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్ (RRR), రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్ (ORR) మధ్య ఉన్న జోన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్ట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
మూసీ నది పునరుజ్జీవంలో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్ వే అభివృద్ధికి జపాన్ నగరాలైన టోక్యో, ఒసాకాల శ్రేష్ఠమైన అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని గుర్తుచేస్తూ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్ రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం రాష్ట్రంలో నెలకొన్నదని వివరించారు.
పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్ గారు మాట్లాడుతూ, నైపుణ్యాల శిక్షణతో పాటు నాణ్యత, క్రమశిక్షణకు అద్దం పట్టేలా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ’ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది ఉపాధి, వ్యాపార అవకాశాలను రెట్టింపు చేస్తుందన్నారు.


