
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలక పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మరుబెనీ (Marubeni Corporation) తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది.
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు మరుబెనీ సంసిద్ధమైంది. టోక్యోలో మరుబెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని కలిసి, ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు.
మరుబెనీ రూ. 1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో దశలవారీగా ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ (letter of intent (LOI)పై ముఖ్యమంత్రి గారి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మరుబెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు.
జపాన్ మరియు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఈ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అంచనా ఉంది.
మరుబెనీ ఇండస్ట్రియల్ పార్క్ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి సారిస్తుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు నైపుణ్య ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపడుతారు.
చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీలో మరుబెనీకి స్వాగతం పలికారు. ఈ పార్క్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే తొలి ప్రాజెక్ట్ అవుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా తెలంగాణలో సుమారు 30,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు సృష్టించబడి, జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు.
తెలంగాణలో వ్యాపారానికి అనుకూలమైన అవకాశాలున్నాయని, మరుబెనీకి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే తొలి నెట్ జీరో సిటీగా అభివృద్ధి చెందుతుందని, మరుబెనీ పెట్టుబడులకు ముందుకొచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. భారత్-జపాన్ స్నేహ బంధం దృష్ట్యా పెట్టుబడిదారులు తెలంగాణను స్వస్థలంగా భావిస్తారని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిని విస్తరించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఎంచుకున్న వ్యూహాలు, వారి దార్శనికతను మరుబెనీ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దయ్ సకాకురా గారు అభినందించారు. తెలంగాణలో పెట్టుబడులకు తాము ఆసక్తిగా ఉన్నామని, అక్కడి అవకాశాలను వినియోగించుకునేందుకు ముందువరుసలో ఉంటామని సకాకురా గారు పేర్కొన్నారు.
మరుబెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ వంటి రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50,000 మంది ఉద్యోగులను నియమించుకుంది.

