Hon’ble CM Sri Revanth Reddy Leads Telangana Delegation to Kitakyushu, Signs Key MoUs for Eco-Town Development in Hyderabad

Nct Japan Cm 1
Nct Japan Cm 2

జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటుంది.

ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, అధికారులతో కూడిన బృందం కిటాక్యూషు సిటీ మేయర్ కజుహిసా టెక్యూచి గారితో సమావేశమైంది. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన నగర మోడల్స్, నదుల పునరుజ్జీవన విధానాలపై చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ఈఎక్స్ (EX) రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్ఎల్సీ (P9 LLC), నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి గారి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LoI) పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. కిటాక్యూషు మాదిరిగా హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి.

ఒకప్పుడు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ కిటాక్యూషు నగరం ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో మేయర్ కజుహిసా టెక్యూచి గారు వివరించారు. తమ అనుభవాలు, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదు అవసరం అని అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. హైదరాబాద్‌లో ఎకో టౌన్ అభివృద్ధి చేయటం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాద కరమై పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.

మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ, పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా వృద్ధి చెందిందని అన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో పాటు తమ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన జపాన్ కంపెనీల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని అన్నారు.

హైదరాబాద్ – కిటాక్యూషు నగరాల మధ్య విమాన సర్వీస్ ఏర్పాటు చేయాలనే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లో జపనీస్ భాషా పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. జపాన్‌లో యువ శక్తి అవసరం ఎక్కువగా ఉందని, మన యువతకు జపనీస్ భాషపై నైపుణ్యం కలిగిస్తే, అంతర్జాతీయంగా వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు.

ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం మురాసాకి పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించింది. గతంలో కాలుష్య కాసారంగా ఉన్న ఈ నది, పరిశుభ్రమైన నదీతీరంగా మారిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.

Nct Japan Cm 3
Nct Japan Cm 4