
జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం టోక్యో నగరంలో ప్రఖ్యాత మల్టీనేషన్ వ్యాపార దిగ్గజం సోనీ కార్పోరేషన్ (Sony Group Corporation) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ (Crunchyroll) బృందాన్ని కలిసింది.
సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ప్రదర్శించిన కంపెనీ ప్రతినిధులు, ఆయా ఉత్పత్తులతో పాటు వారి పని తీరును ముఖ్యమంత్రి గారికి వివరించారు.
ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి గారి బృందం వివరణాత్మక చర్చలు జరిపింది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ , గేమింగ్ రంగాలలో పెట్టుబడుల విస్తరణకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది.
ఎండ్-టు-ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు తమ భవిష్యత్తు విజన్‌ను వారితో పంచుకున్నారు.

