CM Sri Revanth Reddy Urges Telangana Universities to Revamp Courses in Line with Market Demand

Higher Education 1
Higher Education 2

మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లోని కోర్సులలో మార్పులు రావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్లకు సూచించారు. మార్కెట్‌లో డిమాండున్న కోర్సులను బోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా వర్సిటీలు పని చేయాలని అన్నారు.

విశ్వవిద్యాల‌యాల వైస్ ఛాన్స‌ల‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి గారు సమావేశమయ్యారు. ప్ర‌భుత్వ విశ్వవిద్యాల‌యాల‌కు గ్రామీణ ప్రాంతాల నుంచి, ఆర్థిక స్థోమ‌త లేని కుటుంబాల నుంచే విద్యార్థులు వ‌స్తున్నార‌ని, వారి భ‌విష్య‌త్తును తీర్చిదిద్దే బోధనకు వర్సిటీలు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

ఆర్థికంగా స్థోమ‌త ఉన్న కుటుంబాల పిల్లలు మార్కెట్‌లో డిమాండున్న కోర్సుల‌ను ఎంచుకొని ప్రైవేటు విశ్వవిద్యాల‌యాల వైపు వెళ్తున్నారని, వారితో ఎదుర‌య్యే పోటీని ప్ర‌భుత్వ విశ్వవిద్యాల‌యాల విద్యార్థులు ఎదుర్కోవాలంటే డిమాండున్న కోర్సుల‌నే బోధించాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

గ‌తంలో నియ‌మితులైన ప్రొఫెస‌ర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెస‌ర్లు ఉన్నార‌న్న భావ‌న‌తో ప‌లు విశ్వవిద్యాల‌యాల్లో పెద్ద‌గా ప్రాధాన్యం లేని కోర్సుల‌ను బోధిస్తున్నార‌ని, వాటిని ర‌ద్దు చేసి నూత‌న కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని సూచించారు. వర్సిటీలు కొందరు ప్రొఫెసర్లకు రిహాబిలిటేషన్ సెంటర్లుగా మారొద్దని, అలాంటి వారికి అడ్మినిస్ట్రేటివ్ బాధ్య‌తలు అప్ప‌గించాల‌ని పేర్కొన్నారు.

విశ్వవిద్యాలయ్యాల్లో ప్రొఫెసర్ల కొరత, భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను వీసీలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చారు. వర్సిటీలను తీర్చిదిద్దడానికి అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

విశ్వవిద్యాలయాల ఉమ్మడి సమస్యలు, అలాగే వర్సిటీల వారిగా ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు గారితో సమావేశమై చర్చించాలని, ఆయా అంశాలపై ప్రభుత్వానికి సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సూచించారు.

ఈ స‌మావేశంలో కేశవరావు గారితో పాటు స‌ల‌హాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డి గారు, విద్యా క‌మిష‌న్ ఛైర్మ‌న్ ఆకునూరి ముర‌ళి గారు, యూనివ‌ర్సిటీల వైస్ ఛాన్స‌ల‌ర్లు ప్రొ. కుమార్ మొలుగారం గారు, ప్రొ. కె.ప‌త్రాప్ రెడ్డి గారు, డాక్ట‌ర్ టి.యాద‌గిరిరావు గారు, ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌ గారు, ప్రొ. జీఎన్. శ్రీ‌నివాస్‌ గారు, ప్రొ. ఉమేష్ కుమార్‌ గారు, ప్రొ. సూర్య ధ‌నంజ‌య్‌ గారు, ప్రొ. కిష‌న్ కుమార్ రెడ్డి గారు, ప్రొ. టి.గంగాధ‌ర్‌ గారు, ప్రొ. ఏ.గోవ‌ర్ధ‌న్‌ గారు, ప్రొ. వి.నిత్యానంద‌రావు గారు, ప్రొ. ఘంటా చ‌క్ర‌పాణి గారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Higher Education 3
Higher Education 4