CM Sri Revanth Reddy Launches ‘Bhoo Bharati’ to Resolve Land Issues Permanently and Promote Transparent Land Governance in Telangana

Bhu Bharathi Launc Program 1
Bhu Bharathi Launc Program 2

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన ‘భూ భారతి’ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ యంత్రాంగాన్ని కోరారు. తెలంగాణలో వివాద రహిత భూ విధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని స్పష్టం చేశారు. ఆధార్ తరహాలో భవిష్యత్‌లో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ‘భూధార్’ తీసుకొస్తామని ప్రకటించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి శుభసందర్భంగా ప్రభుత్వం నూతనంగా తెచ్చిన భూ భారతి చట్టం, భూ భారతి పోర్టల్‌ను ముఖ్యమంత్రి గారు శిల్ప కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ..

“పైలట్ ప్రాజెక్టుగా తొలి విడతా భూ భారతిని నాలుగు మండలాల్లో చేపడుతాం. ప్రజా పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.

ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉంది. రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. గత పాలకుల తరహాలో రెవెన్యూ సిబ్బందిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచనకు ప్రజా ప్రభుత్వం వ్యతిరేకం. అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా వ్యవహరిస్తాం. కానీ వ్యవస్థపై కాదు.

ఎంతో మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భారతి చట్టం తెచ్చాం.

ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి విజ్ఞప్తులను తీసుకుని వాటిని పరిష్కరించాలి. ప్రభుత్వలక్ష్యం నెరవేరాలంటే రెవెన్యూ సిబ్బంది మాత్రమే ఆ పనిని చేయగలరు. రెవెన్యూ సిబ్బంది రైతాంగాన్ని రెండు కళ్ల లాంటి వారు. రెవెన్యూ శాఖపైన కొందరు సృష్టించిన అపోహలను తొలగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

గ్రామాలు, మండలాల్లో ప్రజా దర్బార్లు, రెవెన్యూ సదస్సులు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలి. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. ఈ చట్టాన్ని గ్రామాలకు తీసుకెళ్లండి..” అని ముఖ్యమంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభాపతి గడ్డం ప్రసాద కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఇతర మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతు కమిషన్ చైర్మన్, సభ్యులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.\

Bhu Bharathi Launc Program 3
Bhu Bharathi Launc Program 4
Bhu Bharathi Launc Program 5