CM Sri Revanth Reddy Directs Immediate Release of Draft Bill for Gig Workers’ Welfare for Public Feedback

Gig Workers Bill Meeting 1
Gig Workers Bill Meeting 2

గిగ్ వర్కర్లకు భద్రత కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు (Platform based Gig Workers (Social Security and Welfare) Bill) ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు.

గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా సదుపాయం, ఇతర హక్కులను కల్పించేలా కార్మిక శాఖ రూపొందించిన ముసాయిదా “తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ బిల్లు”లో పొందుపరిచిన అంశాలను అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రి గారికి వివరించారు.

ముసాయిదాలో ముఖ్యమంత్రి గారు పలు మార్పులు చేర్పులను సూచించారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వటంతో పాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం, సుహృద్భావం ఉండేలా కొత్త చట్టం ఉండాలని చెప్పారు. ఈ బిల్లు ముసాయిదాను వెంటనే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి, ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్స్ డ్రైవర్లు, ప్యాకేజ్ డెలివరీల్లో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని, అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. ముసాయిదాలో పొందుపరిచిన అంశాలపై తుది కసరత్తు చేయాలని, అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈనెల 25వ తేదీ నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలని ఆదేశించారు.

నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసే అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే డే రోజున ఈ బిల్లును అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

గిగ్ వర్కర్లు, ప్లాట్ ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దేశంలోనే మొదటి సారిగా గిగ్ వర్కర్లకు ప్రమాద బీమాను అమలు చేశామని చెప్పారు.

గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లు మరణిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమాను అందించేలా 2023 డిసెంబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కొత్తగా అమలు చేసే చట్టం కూడా దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Gig Workers Bill Meeting 3
Gig Workers Bill Meeting 4