“CM Sri Revanth Reddy’s Commitment to 42% Reservations for Weaker Sections and the Importance of Caste Census”

Bc Reservations Cm Pic 1
Bc Reservations Cm Pic 2

బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు జరిగే పోరాటానికి ముందుండి నాయకత్వం వహిస్తానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహించిన కుల సర్వేను తప్పుబడితే బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విడమరిచి చెప్పారు.

విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా బీసీ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.

“2026 లో జరిపే జన గణనలో కులగణన చేర్చాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. మనం అందరం కలిసి కొట్లాడితే కుల గణనను ఎందుకు చేర్చరు. కొట్లాడితే తెలంగాణ రాలేదా? కొట్లాడితే దేశానికి స్వతంత్రం రాలేదా? కొట్లాడితే జన గణనలో కుల గణన ఎందుకు చేర్చరు. జన గణనలో ఒకసారి కులగణన చేర్చితే ఆ తర్వాత ప్రతి పదేళ్లకోసారి మరింత స్పష్టత వస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులగణన చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తుంది. ఈ ప్రక్రియలో భాగస్వాములం కావడం మాకు గర్వకారణంగా ఉంది. దీన్ని తప్పుబడితే బీసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. బలహీన వర్గాలు తమ హక్కుల సాధన కోసం చేసే పోరాటానికి పూర్తి మద్దతుగా నిలబడుతా.

ఈ సర్వే పునాది లాంటిది. పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్నవారవుతారు. ముందు అమలు చేసుకుని తర్వాత అవసరాన్ని బట్టి సవరణలు చేసుకోవచ్చు. ఈ కుల గణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని భావించే వారి ఉచ్చులో పడొద్దు” అని హితవు చెప్పారు.

Bc Reservations Cm Pic 6
Bc Reservations Cm Pic 3
Bc Reservations Cm Pic 5