“CM Sri Revanth Reddy Secures McDonald’s Global Capability Center Investment in Hyderabad”

Cm Sir Mc Donalds 20 03 2025 Pic 1
Cm Sir Mc Donalds 20 03 2025 Pic 2

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రఖ్యాత అమెరికన్ మల్టీనేషన్ ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్ (McDonald’s Corporation) చైర్మన్ & సీఈవో క్రిస్ కెంజిన్స్కీ (Chris Kempczinski) గారితో సమావేశమయ్యారు. చర్చల అనంతరం మెక్‌డొనాల్డ్స్ (McDonald’s) సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో భారీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.

మెక్‌డొనాల్డ్స్ పెట్టుబడుల కోసం దేశంలోని ప్రముఖ నగారాలు పోటీపడినా, హైదరాబాద్ నగరంలోని సానుకూలతలు, ఇక్కడ అందుబాటులో ఉన్న నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం తదితర అంశాలను ముఖ్యమంత్రి గారు వివరించి, మెక్ డొనాల్డ్స్ సంస్థ తన గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (Global Capability Centre -GCC) ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ఒప్పించారు.

గడిచిన 15 నెలల కాలంలో తెలంగాణలో చోటుచేసుకున్న అభివృద్ది, యువతకు నైఫుణ్యతలు నేర్పించడానికి ఇస్తున్న ప్రోత్సాహం, అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ (YISU) వివరాలను ముఖ్యమంత్రి గారు మెక్‌డొనాల్డ్స్ కంపెనీ ప్రతినిధులకు వివరించారు.

మెక్‌డొనాల్డ్స్ తమ గ్లోబల్ ఆఫీసును ఏర్పాటు చేయడమే కాదు, భారత దేశ వ్యాప్తంగా ఉన్న తమ రెస్టారెంట్ ఆపరేషన్ల కోసం తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నుంచి శిక్షణ పొందినవారిని తీసుకోవాలని సీఎం గారు సూచించారు.

మెక్‌డొనాల్డ్స్ ఫుడ్ చైన్‌కు అవసరమయ్యే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను కూడా ఇక్కడే కొనుగోలు చేసినట్లయితే అది తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి, వ్యవసాయదారులకు లాభదాయకంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలో మానవ వనరులు, జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్న కారణంగానే బెంగళూరును కాదని హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చైర్మన్, సీఈవో క్రిస్ గారు చెప్పారు.

హైదరాబాద్‌లో ఏర్పాటయ్యే మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు తొలి దశలోనే 2,000 మందికి ఉద్యోగాలను కల్పిస్తుందని, భవిష్యత్తులో మరికొన్ని వేల ఉద్యోగాలకు అవకాశం ఉంటుందని క్రిస్ గారు వివరించారు.

మెక్‌డొనల్డ్స్ సంస్థకు తెలంగాణలో ప్రస్తుతం 38 ఔట్‌లెట్లు ఉండగా, రాబోయే కాలంలో ప్రతిఏటా 3 నుంచి 4 కొత్త ఔట్‌లెట్లను.. అది కూడా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో నెలకొప్పడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఈ సమావేశంలో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ బిజినెస్ ప్రెసిడెంట్ స్కై అండర్సన్ గారు, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బానర్ గారు, జీబీఎస్ హెడ్ దిశాంత్ కైలా గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారు, సీం కార్యదర్శి అజిత్ రెడ్డి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Cm Sir Mc Donalds 20 03 2025 Pic 3