“CM Sri Revanth Reddy Reviews Link Road Development in Hyderabad with HMDA & HRDCL Officials”

Link Road Dev Hmda

హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జావస‌రాల‌కు అనుగుణంగా అనుసంధాన (లింక్‌) రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. రాజ‌ధాని న‌గ‌రంతో పాటు హెచ్ఎండీఏ ( HMDA) ప‌రిధిలో హైద‌రాబాద్ రోడ్డు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (HRDCL) ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న అనుసంధాన ర‌హ‌దారుల నిర్మాణం, విస్త‌ర‌ణ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి గారు స‌మీక్ష నిర్వ‌హించారు.

వివిధ ప్రాంతాల మ‌ధ్య అనుసంధాన‌త పెంచ‌డం, ప్ర‌జ‌లు ఎటువంటి అవాంత‌రాలు లేకుండా రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా ర‌హ‌దారుల నిర్మాణం ఉండాల‌ని ఆదేశించారు. హెచ్ఎండీఏ పరిధిలో 49 రోడ్ల నిర్మాణం, విస్త‌ర‌ణ‌పై ముఖ్య‌మంత్రి ప‌లు సూచ‌న‌లు చేశారు.

అనుసంధాన ర‌హ‌దారుల నిర్మాణం, ప్ర‌స్తుతం ఉన్న ర‌హ‌దారుల విస్త‌ర‌ణ విష‌యంలో భ‌విష్య‌త్ అవ‌స‌రాలు, విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. ఆయా ర‌హ‌దారుల నిర్మాణంతో ప్ర‌యాణికుల ఇబ్బందులు తొల‌గిపోవ‌డంతో పాటు వారికి స‌మ‌యం క‌లిసి వ‌చ్చేలా ఉండాల‌ని, ఈ క్ర‌మంలో అద‌న‌పు భూసేక‌ర‌ణ‌కు కొంత అధిక వ్య‌య‌మైనా వెనుకాడ‌వ‌ద్ద‌ని చెప్పారు.

ఈ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.