CM Sri Revanth Reddy Distributes Appointment Letters to 922 New Employees Under the newly launched “People’s Government – Jobs Festival”

Cm Sir Jobs Pic 3
Cm Sir Jobs Pic 1

“దశాబ్ద కాలం అవకాశాల కోసం ఎదురుచూసిన మీ కల నెరవేరుతోంది. ఇదొక అనిర్వచనీయ సందర్భం. ఉద్యోగాల్లో చేరుతున్న మీ అందరికీ అభినందనలు. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం వచ్చింది. జీవిత కాలం గుర్తుండిపోయే సందర్భం. తెలంగాణను ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడంలో మీరంతా భాగస్వాములు కావాలి” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న అభ్యర్థులను ఉద్దేశించి పిలుపునిచ్చారు.

“ప్రజా ప్రభుత్వం – కొలువుల పండుగ” పేరిట పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల శాఖల్లో కారుణ్య, ఇతర నియామకాల కింద 922 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..

“కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా మీకు చెందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు.. గత ప్రభుత్వాలు దాదాపు 2015 నుంచి కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో జీవితంలో అత్యంత విలువైన మీ సమయం కాలగర్భంలో కలిసిపోయింది.

తెలంగాణ ఏర్పడితే ఖాళీలన్నింటినీ భర్తీ చేసి యువతలో ఒక విశ్వాసాన్ని, ఆత్మస్థయిర్యాన్ని పెంచడానికి ప్రభుత్వాలు పనిచేస్తాయని భావించారు. కానీ యువతీ యువకుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం.

ఉద్యోగం జీవితంలో వారికి ఒక మరుపురాని గొప్ప అనుభూతిగా మిగిలిపోతుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ తొలి ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వాలు లేవు. ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక మోడల్ గా నిలబడింది” అని వివరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు గారు, ఎస్. వేణుగోపాలా చారి గారు, పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగమైనా, నాయకత్వమైనా చివరి వరకు నిబద్దతతో ఉండటం, టెంపర్మెంట్ కోల్పోకపోవడం అత్యంత ముఖ్యమని, కొత్తగా ఉద్యోగాలు పొందినవారంతా తెలంగాణ పురోగతికి కృషి చేయాలని ముఖ్యమంత్రి గారు హితవుపలికారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు గారు, పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Cm Sir Jobs Pic 2
Cm Sir Jobs Pic 4