CM Revanth Reddy Announces Vanguard Group’s First India GCC in Hyderabad, Plans to Hire 2,300 Professionals.

Gcc 2025 1
Gcc 2025 2

ప్రపంచంలోని ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘వాన్‌గార్డ్’ (Vanguard Group) హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వాన్‌గార్డ్ మన దేశంలో నెలకొల్పే తొలి జీసీసీ ఇదే కావటం విశేషం.

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారితో వాన్‌గార్డ్ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.

Vanguard Group సీఈఓ సలీం రాంజీ గారు, ఐటీ డివిజన్ సీఐఓ, ఎండీ నితిన్ టాండన్ గారు, చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ జాన్ కౌచర్ గారు, జీసీసీ – వాన్‌గార్డ్ ఇండియా హెడ్ వెంకటేష్ నటరాజన్ గారి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఉన్నారు.

ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌లో జీసీసీ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు వాన్‌గార్డ్ తెలిపింది. రాబోయే 4 సంవత్సరాల్లో 2,300 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించింది.

వాన్‌గార్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్లకు పైగా పెట్టుబడిదారులకు సేవలు అందిస్తోంది.

Hyderabad లో వాన్‌గార్డ్ ఏర్పాటు చేసే కేంద్రం ఇన్నోవేషన్​ హబ్‌గా పనిచేయనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటిక్స్, మొబైల్ ఇంజనీరింగ్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అందుకు అవసరమైన ఇంజనీర్లను తక్షణమే నియమించుకోవాలని ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు వాన్‌గార్డ్ ముందుకు రావటం సంతోషకరమైన పరిణామంగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. TelanganaRising విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి జీసీసీ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. వాన్‌గార్డ్ రాకతో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ మరింత బలపడుతుందని అన్నారు. మన దేశంలోని ప్రతిభను ఉపయోగించుకోవడానికి, సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుందని వివరించారు.
జీసీసీ నెలకొల్పడానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తుందని కంపెనీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు.

వైవిధ్యమైన ప్రతిభతో పాటు, జీవన నాణ్యత, సాంకేతిక నైపుణ్యం, ఆవిష్కరణలకు హైదరాబాద్‌ అనుకూలమైన వాతావరణం కలిగి ఉందని కంపెనీ సీఈవో సలీం రాంజీ అభిప్రాయపడ్డారు. వీటికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో హైదరాబాద్‌ను తమకు అనువైన చోటుగా ఎంచుకున్నామని తెలిపారు.

తమ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలను అందించటంతో పాటు ఏఐ, మొబైల్, క్లౌడ్ టెక్నాలజీలో ప్రతిభావంతులైన ఇంజనీర్లను అవకాశాలు కల్పించటం తమకు సంతోషంగా ఉందన్నారు.

Gcc 2025 3