యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్ సైట్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు

తెలంగాణ పోలీసు కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సంబంధించి వెబ్‌సైట్‌ https://yipschool.in ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో పోలీస్ స్కూల్ వెబ్‌సైట్‌తో పాటు సమగ్ర సమాచారంతో కూడిన బ్రోచర్‌ను విడుదల చేశారు.

481975691 1058094213024041 9052329313993344920 N

2025-26 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలకు స్కూల్ యూనిఫామ్‌తో పాటు ఇతర అంశాలను ముఖ్యమంత్రి గారు పరిశీలించారు. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్‌ను కూడా దేశానికి ఒక రోల్ మాడల్‌గా ఉండేలా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సూచించారు.

విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంభించాలని, క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అడ్మిషన్లలో పోలీసు అమరుల కుటుంబాల పిల్లలకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గారు, అదనపు డీజీపీ (ఆపరేషన్స్) స్టీఫెన్ రవీంద్ర గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు కుటుంబాల పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయి స్కూల్ నిర్మాణం కోసం గత ఏడాది అక్టోబర్ 21 న ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేశారు.