CM Participated in World Telugu Federation’s 12 Biennial Conference

Hon’ble Chief Minister Sri.A.Revanth Reddy participated in World Telugu Federation’s 12 Biennial Conference at HICC, Hyderabad on 5th January, 2025.

05 01 2025 Hcm Speech Points World Telugu Fedaration 1

జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించడంలో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగు భాషను, ఉనికిని, మనుగడను, మన సంప్రదాయాన్ని కోల్పోకుండా కాపాడుకోవలసిన అవసరం ఉందని చెప్పారు.

✅ ప్రపంచ తెలుగు సమాఖ్య (WTF) నిర్వహించిన 12 వ ద్వైవార్షిక సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రచురించిన “తెలుగుదనం – తెలుగుధనం” పుస్తకాన్ని ఆవిష్కరించారు.

✅ గతంలో దేశ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారని, నీలం సంజీవరెడ్డి గారు, పీవీ నరసింహారావు గారు, ఎన్టీఆర్ గారు, కాకా వెంకటస్వామి గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారి లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు.

✅ రాజకీయం, సినీ, వాణిజ్య రంగాల్లో ఎంతస్థాయిలో రాణించినప్పటికీ మన భాషను మరిచిపోవద్దని, పరభాషా జ్ఞానం సంపాదించాలి కానీ, మన భాషను గౌరవించాలని అన్నారు.

✅ తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో రైతులు రుణమాఫీ విషయంలో జీవోను తెలుగులో ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. న్యాయస్థానాల్లోనూ తీర్పు ప్రతులు తెలుగులో ఉంటే ఎంతోమందికి ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.

✅ హైదరాబాద్ నగరానికి మౌలిక సదుపాయాల కల్పనలో గతంలో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రులు చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ, తెలంగాణ రైజింగ్ నినాదంతో 2050 అభివృద్ధి ప్రణాళికలతో తెలంగాణలో ముందుకు వెళుతున్నామని, ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పారు.

✅ వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులకు సింగిల్ విండో పర్మిషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

✅ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. ఈ సదస్సులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, సమాఖ్య అధ్యక్షురాలు వీఎల్ ఇందిరా దత్ గారు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

05 01 2025 Hcm Speech Points World Telugu Fedaration 4
Telangana Rising