CM met with Prime Minister Sri Narendra Modi

Cm Revanth Reddy Met Prime Minister Narendra Modi 04 07 2024 (2)

Telangana CM Revanth Reddy’s Major Appeals to PM Narendra Modi

Telangana Chief Minister Revanth Reddy met with Prime Minister Narendra Modi on Thursday to discuss several critical issues pertinent to the state. The key requests presented by The Chief Minister include:

  1. Allocation of Coal Blocks to Singareni Collieries Company Limited (SCCL): The Chief Minister urged the removal of the Shravanapalli coal block from the auction list and its allocation, along with Koyagudem and Sattupalli Block 3, to SCCL. This is vital to meet the state’s power generation needs.
  2. Revival of Information Technology Investment Region (ITIR) in Hyderabad: Emphasizing the need to boost IT infrastructure, The Chief Minister sought the revival of ITIR in Hyderabad to encourage the growth of new IT companies and developers. The project, initially approved in 2010, has been stalled since 2014.
  3. Sanction of Defense Land: A request was made for the allocation of 2,450 acres of defense land to the state for infrastructure projects, including elevated corridors on the Hyderabad-Karimnagar and Hyderabad-Nagpur highways (NH-44). The Chief Minister offered alternative land in Raviryal in exchange.
  4. Fulfillment of State Reorganization Act Promises: The Chief Minister reiterated the need to fulfill promises made during the state reorganization, including the establishment of a steel plant in Bayyaram and a coach factory in Kazipet.
  5. Sanction of 2.5 Million Houses under PMAY: Highlighting the lower allocation in the initial phase, The Chief Minister requested the sanction of 2.5 million houses for Telangana in the upcoming phase of the Pradhan Mantri Awas Yojana (PMAY). The state is prepared to align its guidelines with those of PMAY.
  6. Inclusion in India Semiconductor Mission: Given the interest of several companies in setting up semiconductor fabs in Hyderabad, CM Reddy sought the inclusion of Telangana in the India Semiconductor Mission.
  7. Establishment of IIM in Hyderabad: CM Reddy requested the immediate sanction of an Indian Institute of Management (IIM) in Hyderabad, citing available land at the Hyderabad Central University campus.
  8. Grant Release under BRGF: A request was made for the release of ₹1,800 crores under the Backward Regions Grant Fund (BRGF) for the years 2019-2024.
  9. Upgrade of State Highways to National Highways: CM Reddy sought the upgrade of 13 state highways to national highways to meet increased transportation needs and improve connectivity to major towns and pilgrimage sites.
  10. Speedy Construction of Regional Ring Road (RRR): The Chief Minister urged expedited tenders for the northern part of the RRR and its southern extension, emphasizing its importance for the development of national highways around Hyderabad.

The meeting, accompanied by Deputy Chief Minister Bhatti Vikramarka, lasted approximately one hour, during which these critical issues were discussed in detail.

  • బొగ్గు బ్లాకులు సింగ‌రేణికే కేటాయించాలి..
  • హైద‌రాబాద్‌కు ఐటీఐఆర్‌ను పున‌రుద్ధ‌రించాలి..
  • తెలంగాణ‌కు 25 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయండి..
  • ర‌క్ష‌ణ శాఖ భూముల 2,450 ఎక‌రాలు కేటాయించండి.
  • విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చాలి..
  • ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

సింగ‌రేణి ప‌రిధిలోని బొగ్గు గ‌నుల‌ను సింగ‌రేణికే కేటాయించాల‌ని, ప్ర‌స్తుతం వేలంలో పెట్టిన శ్రావ‌ణప‌ల్లి బొగ్గు బ్లాక్‌ను వేలం జాబితా నుంచి తొల‌గించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌భుత్వ రంగంలో ఉన్న సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్‌)లో తెలంగాణ ప్ర‌భుత్వానికి 51 శాతం, కేంద్ర ప్ర‌భుత్వానికి 41 శాతం వాటాలున్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. గనులు, ఖ‌నిజాభివృద్ధి నియంత్ర‌ణ చ‌ట్టంలోని (ఎంఎండీఆర్‌) సెక్ష‌న్ 11ఏ/17 (ఏ) (2) ప్ర‌కారం వేలం జాబితా నుంచి శ్రావ‌ణ‌ప‌ల్లి గ‌నిని తొల‌గించాల‌ని, అదే సెక్ష‌న్ ప్ర‌కారం గోదావ‌రి లోయ‌ బొగ్గు నిల్వ‌ల క్షేత్రం ప‌రిధిలోని కోయ‌గూడెం, స‌త్తుప‌ల్లి బ్లాక్ 3 గ‌నుల‌నూ సింగ‌రేణికే కేటాయించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్ప‌త్తి కేంద్రాల అవ‌స‌రాలు తీర్చేందుకు ఈ గ‌నుల కేటాయింపు కీల‌కమైనందున, సింగ‌రేణికే వాటిని కేటాయించాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఆయ‌న నివాసంలో గురువారం మ‌ధ్యాహ్నం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌లిశారు. బొగ్గు గ‌నుల కేటాయింపు, ఐటీఐఆర్ పున‌రుద్ధ‌ర‌ణ‌, ర‌క్ష‌ణ భూముల కేటాయింపు, రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలపై ప్ర‌ధాన‌మంత్రితో ముఖ్య‌మంత్రి చ‌ర్చించారు. ప్ర‌ధాన‌మంత్రి నివాసానికి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సుమారు గంట‌సేపు రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై ప్ర‌ధాన‌మంత్రితో చ‌ర్చించారు. ప్ర‌ధాన‌మంత్రితో ముఖ్య‌మంత్రి భేటీలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పాల్గొన్నారు.

2010 సంవ‌త్సరంలో నాటి యూపీఏ ప్ర‌భుత్వం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు స‌మాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్‌) మంజూరు చేసింద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఐటీ రంగంలో నూత‌న కంపెనీలు, డెవ‌ల‌ప‌ర్ల‌ను ప్రోత్స‌హించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో అందుకు అవసరమైన భూమిని గుర్తించింద‌న్నారు. 2014 త‌ర్వాత ఐటీఐఆర్ ముందుకు సాగ‌లేద‌ని, హైద‌రాబాద్‌కు ఐటీఐఆర్ పున‌రుద్ధ‌రించాల‌ని పీఎంను సీఎం కోరారు.

కోచ్ ఫ్యాక్ట‌రీ… ఐఐఎం….
ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకున్నా ఇప్పటివరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ దృష్టికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వెంట‌నే హైద‌రాబాద్‌లో ఐఐఎం మంజూరు చేయాలని, ఇందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో సరిపడా భూమి అందుబాటులో ఉంద‌ని తెలిపారు. సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో కాకుండా మ‌రెక్క‌డైనా ఐఐఎం ఏర్పాటు చేస్తామ‌న్నా ప్ర‌త్యామ్నాయంగా భూ కేటాయింపున‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. రాష్ట్రానికి 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్ట‌రీకి కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. కోచ్ తయారీ కేంద్రానికి బ‌దులు కాజీపేటలో పీరియాడికల్ ఓవరోలింగ్ వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింద‌ని తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజీపేటలో మాత్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్ర‌క‌టించ‌డం స‌రికాద‌న్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ప్ర‌ధాన‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు.

ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో తెలంగాణను చేర్చాల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్స్‌ను నెల‌కొల్పేందుకు ప‌లు కంపెనీలు ఆస‌క్తి క‌న‌ప‌ర్చుతున్న‌ట్లు మోదీకి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఆయా కంపెనీల ప్రతిపాదనలు ప్రస్తుతం ఇండియా సెమీకండక్టర్ మిషన్ సమీక్షలో ఉన్నందున‌, ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించాలని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

తెలంగాణ‌కు ఇళ్లు కేటాయించండి…
ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ (PMAY) తొలి దశలో తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇళ్లు మంజూర‌య్యాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నాడు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవడంతో తక్కువ ఇళ్లు మంజూర‌య్యాయ‌ని వివ‌రించారు. 2024-25 నుంచి ప్రారంభమవుతున్న పీఎంఏవై పథకంలో 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింద‌ని, అందులో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విధివిధానాలను రూపొందించేందుకు సిద్దంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.
సంసిద్ధంగా ఉంది.

బీఆర్‌జీఎఫ్ నిధులు రూ.1800 కోట్లు ఇవ్వండి..
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (BRGF) కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు అయిదేళ్ల‌లో తెలంగాణ‌కు రూ.2,250 కోట్లు కేటాయించింద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కో ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున ఈ గ్రాంట్ మంజూరు చేశార‌ని, 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి బీఆర్‌జీఎఫ్ కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన రూ.1,800 కోట్లు విడుదల చేయాలని ప్ర‌ధాన‌మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

రక్షణ శాఖ భూముల బదిలీ చేయండి…
రాజధాని హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్-కరీంనగర్ రహదారి, హైదరాబాద్- నాగ్‌పూర్ ర‌హ‌దారి (ఎన్‌హెచ్‌-44)పై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన‌మంత్రికి తెలియ‌జేశారు. ఆ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని కోరారు. ఆ కారిడార్ల‌తో పాటు హైదరాబాద్ న‌గ‌రంలో రహదారుల విస్తరణ, రవాణా, ఇత‌ర‌ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో 2450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ (RIC) కి లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు త‌మ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంద‌ని తెలిపారు.

బ‌య్యారంలో ఉక్కు క‌ర్మాగారం
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికలు సమర్పించాయ‌ని, వెంట‌నే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పి ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్య‌మంత్రి కోరారు.

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం వేగవంతం చేయాలి..
భారత్‌మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింద‌ని ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. ఆ ర‌హ‌దారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చును ఇవ్వ‌డంతో పాటు రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రికి ముఖ్య‌మంత్రి తెలియ‌జేశారు. ఈ ర‌హ‌దారులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలని కోరారు. హైదరాబాద్ చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యంత ఉప‌యోగంగా ఉండే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంట‌నే జాతీయ రహదారిగా గుర్తించి, వెంట‌నే భారత్ మాల పరియోజనలో దాని నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

జాతీయ ర‌హ‌దారులుగా…
తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. జగిత్యాల-పెద్దపల్లి-కాటారం, దిండి-దేవరకొండ-మల్లెపల్లి-నల్గొండ, భువనగిరి- చిట్యాల, చౌటుప్పల్ అమన్‌గల్-షాద్ న‌గ‌ర్‌-సంగారెడ్డి, మరికల్- నారాయణపేట రామసముద్ర, వనపర్తి-కొత్తకోట-గద్వాల మంత్రాలయం, మన్నెగూడ-వికారాబాద్-తాండూరు-జహీరాబాద్-బీదర్, కరీంనగర్-సిరిసిల్ల- కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు-గద్వాల-రాయచూరు, కొత్తపల్లి- హుస్నాబాద్- జనగాం- హైదరాబాద్, సారపాక- ఏటూరునాగారం, దుద్దెడ- కొమురవెల్లి-యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట- వైరా-కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

Telangana Rising